కన్నడ లెజెండ్ కు కేంద్రం ప్రతిష్ఠాత్మక పురస్కారం
కన్నడ లెజెండరీ యాక్టర్ అనంత్ నాగ్‌కు అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన విశిష్ట సేవలకు గాను కేంద్రం ఈ అవార్డుతో గౌరవించింది. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఈ వివరాలను ప్రకటించింది. ఈ నెల 22న గుజరాత్‌లోని కెవాడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు.
ఈ గొప్ప గౌరవం దక్కడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా అనంత్ నాగ్‌కు అభినందనలు తెలిపారు. దశాబ్దాలుగా అనంత్ నాగ్ తన అద్భుతమైన నటనతో, అసాధారణమైన బహుముఖ ప్రజ్ఞతో కన్నడ చిత్రసీమపై చెరగని ముద్ర వేశారని ప్రధాని మోదీ కొనియాడారు. దేశవ్యాప్తంగా చలనచిత్ర ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

1948 సెప్టెంబర్ 4న జన్మించిన అనంత్ నాగ్.. కన్నడ చిత్ర పరిశ్రమలో వైవిధ్యభరితమైన నటుల్లో ఒకరు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన 300కు పైగా చిత్రాల్లో అద్భుత పాత్రలు పోషించారు. ఇందులో 250కి పైగా కన్నడ సినిమాలు ఉన్నాయి. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, మలయాళీ చిత్రాల్లోనూ ఆయన తన నటనా ప్రతిభను చాటుకున్నారు. వెండితెరపైనే కాకుండా, ప్రసిద్ధ రచయిత ఆర్ కే నారాయణ్ కథల ఆధారంగా దూరదర్శన్‌లో ప్రసారమైన క్లాసిక్ ధారావాహిక మాల్గుడి డేస్ ద్వారా ఆయన దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ పరిచయం అయ్యారు.
మించిన ఊటె, హంసగీతె, కవలుదారి, సర్కారీ హిరియ ప్రాథమిక పాఠశాలె కాసరగోడ్, రాజకుమార, యాన, ఆయుష్మాన్ భవ.. వంటి అనేక చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. నేటి తరం యువ ప్రేక్షకులకు కూడా తన నటనతో బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్: చాప్టర్ 1లో సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ ఇంగలగి పాత్ర ఆయనకు తెచ్చిపెట్టిన ప్రజాదరణ అంతా ఇంతా కాదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ హిస్టరీ, రాకీ భాయ్ ఎదుగుదలను వివరించే సూత్రధారిగా ఆయన చెప్పిన సంభాషణలు, గంభీరమైన స్వరం.. సినిమా మొత్తానికీ హైలైట్.
సినిమా, కళారంగాలకు అనంత్ నాగ్ చేసిన నిరుపమాన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ తో సత్కరించింది. అలాగే ఆయన తన నటనకు గాను అయిదుసార్లు ప్రతిష్టాత్మక కర్ణాటక చలనచిత్ర అవార్డులను దక్కించుకున్నారు. భారతీయ చిత్రసీమ అభివృద్ధికి, పురోగతికి విశేష కృషి చేసిన మహనీయులకు మాత్రమే ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఆయనకు ప్రకటించడం అత్యంత సముచితమైన గౌరవంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.
🎬THE DADASAHEB PHALKE AWARD 2024 GOES TO…
— PIB India (@PIB_India) September 16, 2026
Shri ANANT NAG
On the recommendation of the Dadasaheb Phalke Award Selection Committee, the Government of India is pleased to announce that the Actor will be conferred the prestigious Dadasaheb Phalke Award 2024 for his contribution… pic.twitter.com/3WKnWZDGs0














Click it and Unblock the Notifications
