రక్తం మరిగిన సింహాలకు చెక్: 100 హెక్టార్లలో ఐసోలేషన్ పార్క్...
మనుషులపై దాడులకు తెగబడుతున్న మృగరాజుల కట్టుదిట్టానికి గుజరాత్ అటవీ శాఖ ఒక సంచలన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ సింహాల దినోత్సవం (ఆగస్టు 10) సందర్భాన్ని పురస్కరించుకుని గుజరాత్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మనుషులపై దాడులు చేసి, జనావాసాలపైకి పదే పదే దాడికి వస్తున్న ఆసియాటిక్ సింహాల కోసం ప్రత్యేకంగా 100 హెక్టార్ల భారీ పరిమితి కలిగిన 'ఐసోలేషన్ ఎంక్లోజర్'ను ఏర్పాటు చేయబోతున్నారు. అమ్రేలి జిల్లాలోని ధారీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ అంబర్డి సఫారీ పార్కులో ఈ ప్రత్యేక కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
జనావాసాలకు ముప్పు తప్పించడానికే ఈ వ్యూహం
సాధారణంగా గిర్ అటవీ సరిహద్దు గ్రామాలు, చేనుల్లోకి చొరబడే క్రమంలో సింహాలు మానవులతో ఘర్షణకు దిగుతుంటాయి. మనుషులపై దాడులు చేసి అలవాటుపడిన మృగాలను తిరిగి సాధారణ అడవిలోకి వదిలేస్తే గ్రామీణ ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది.

ఈ రకమైన 'హ్యూమన్-వైల్డ్‌లైఫ్ కాన్‌ఫ్లిక్ట్'ను అరికట్టడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాయకత్వంలో ఈ సైంటిఫిక్ ప్లాన్ రూపకల్పన చేశారు. అమ్రేలిలోని 365 హెక్టార్ల అంబర్డి సఫారీ పార్కు పరిధిలోనే 100 హెక్టార్లలో సహజ సిద్ధమైన వాతావరణంలో పెద్ద ఫెన్సింగ్ (కంచె) వేసి ఈ సింహాలను అక్కడ బంధిస్తారు.
ప్రకృతి ఒడిలోనే.. కానీ కట్టుదిట్టమైన కంచెలో!
మనుషులపై దాడి చేసిన సింహాలను బోనుల్లో బంధించి ఉంచితే వాటి నైజం దెబ్బతింటుంది. అందుకే, వాటికి కావలసిన స్వేచ్ఛాయుతమైన అడవి వాతావరణాన్ని అందిస్తూనే, బయటకు రాకుండా 100 హెక్టార్ల చుట్టూ భారీ ప్రొటెక్షన్ ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు. ఈ విధానం ద్వారా సింహాలు తమ సహజ ఆవాసంలోనే జీవిస్తూ ఉంటాయి, అదే సమయంలో ప్రజలకు వాటి వల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదు. గాయపడిన, వ్యాధుల బారిన పడిన లేదా జనావాసాల్లోకి వచ్చిన జంతువులను శాస్త్రీయంగా తరలించే ప్రక్రియలో భాగమే ఈ నిర్ణయమని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
పర్యాటక రంగానికి మరింత గ్లామర్
2017లో ప్రారంభమైన అంబర్డి సఫారీ పార్క్ ఇప్పటికే గుజరాత్‌లో ప్రముఖ ఈకో-టూరిజం కేంద్రంగా ఉంది. ఆసియాటిక్ సింహాలతో పాటు బావులు, మచ్చల జింకలు, నీల్‌గాయ్, చింకారా , అనేక రకాల అరుదైన పక్షులకు ఇది నిలయం. ఇప్పుడు ఈ పార్కులో రూపొందుతున్న 100 హెక్టార్ల ప్రత్యేక ఐసోలేషన్ జోన్ వల్ల సింహాల సంరక్షణ సులువవ్వడమే కాకుండా, పర్యాటకంగా అమ్రేలి జిల్లా మరింత గుర్తింపు సాధించనుంది. ప్రాణనష్టం జరగకుండా జంతువులను, మనుషులను కాపాడుకునే దిశగా గుజరాత్ ప్రభుత్వం వేసిన ఈ అడుగు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.




Click it and Unblock the Notifications