కాంగ్రెస్ మార్కు కొట్లాటలు
హైదరాబాద్: వరంగల్, సికింద్రాబాద్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాలు రసాభాసగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానాల్లో ఉప ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులను సమాయత్తం చేయడానికి కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. వరంగల్ లో హోం మంత్రి కె. జానారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. తమకు అన్యాయం జరుగుతోందని కార్యకర్తలు విమర్శించారు. హన్మకొండ, వరంగల్ లోకసభ స్థానానికి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జానారెడ్డిని ఇంచార్జీగా నియమించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జానారెడ్డి ఆదివారం వరంగల్ లోని పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్న మాట నిజమేనని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళ్తాననని జానారెడ్డి కార్యకర్తలకు హామీ ఇచ్చారు. దాంతో కార్యకర్తలు సద్దమణిగారు. అయితే జిల్లాకు చెందిన మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, రెడ్యా నాయక్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. సికింద్రాబాదు శాసనసభా నియోజకవర్గంలో కార్యకర్తలు ఘర్షణకు దిగారు. బ్యానరుపై తమ నాయకుడి ఫొటో లేదని ఆగ్రహించిన పిట్ల కృష్ణ వర్గీయులు ఘర్షణకు దిగారు. బ్యానర్లను, కుర్చీలను తగులబెట్టారు. పిట్ల కృష్ణ, మాజీ శాసనసభ్యురాలు మేరీ రవీంద్రనాథ్ వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు.












Click it and Unblock the Notifications