ఆనందోత్సాలతో రంగుల పండుగ
న్యూఢిల్లీ హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రజలు శనివారం హోలీ పర్వదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. ప్రజలు రంగుల్లో తడిసి ముద్దయ్యారు. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన పార్టీ నాయకులతో కలిసి తన నివాసం వద్ద హోలీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. సోనియాకు పార్టీ నాయకులు హోలీ శుభాకాంక్షలు తెలిపి ఆమెపై రంగులు చల్లారు. రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఉత్సాహానికైతే అంతే లేదు. ఆయన రంగుల్లో తేలుతూ కేరింతలు కొట్టారు. హిజ్రాల నృత్యం కూడా జరిగింది. బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కూడా హోలీ జరుపుకున్నారు. ప్రతిపక్ష నేత ఎల్.కె. అద్వానీ రంగులు చల్లుకున్నారు.
హైదరాబాదులో ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. రాజకీయ నాయకులు, సినీ తారలు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బిజెపి కార్యాలయం రంగుల్లో మునిగి తేలింది. తమ పార్టీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయకు బిజెపి కార్యకర్తలు తలకు పాగా తొడిగి రంగుల్లో ముంచి తేల్చారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హోలీని కార్యకర్తల మధ్య జరుపుకున్నారు. హైదరాబాద్ వీధుల్లో రంగు నీళ్లు ప్రవహించాయి. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలు జరిగాయి. తెలంగాణ రచయితలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications