ఉప్పునూతలపై కాకా మండిపాటు
న్యూఢిల్లీ: తనకు చెప్పకుండానే తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి ఈ నెల 24వ తేదీన తలపెట్టిన భువనగిరి సభను వాయిదా వేశారని కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి మండిపడ్డారు. దాని వల్ల ఇంత కాలం చేసిన శ్రమంతా వృధా అయిందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎఐసిసి అధ్యక్షురాల సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి భువనగిరి సభను వాయిదా వేసుకుంటున్నట్లు శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి సభను వాయిదా వేసుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. అహ్మద్ పటేల్ నుంచి ఫోన్ రాకుండానే సభను వాయిదా వేసుకుంటున్నట్లు పురుషోత్తమరెడ్డి ప్రకటించారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ వెళ్లగానే పురుషోత్తమరెడ్డికి ఏమైందో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్ కమిటీ సమావేశానికి ముందే సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం వల్ల ఫలితం సాధించలేకపోయామని ఆయన అన్నారు. కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చిస్తామని ఎఐసిసి అధ్యక్షురాలు గురువారం సాయంత్రం తమకు హామీ ఇచ్చినట్లు సీనియర్లు చెప్పారు. అయితే శుక్రవారం సాయంత్రం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఆ విషయమే చర్చకు రాలేదని అహ్మద్ పటేల్ చెప్పారు.












Click it and Unblock the Notifications