కెసిఆర్ తో భేటీకి విష్ణు విఫలయత్నం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును కలిసేందుకు దివంగత శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి కుమారుడు, ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణువర్దన్ రెడ్డి గురువారం విఫలయత్నం చేశారు. బుధవారం నాడు కెసిఆర్ ను కలుసుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. కెసిఆర్ ను తెరాస పార్టీ కార్యాలయంలో కలుసుకోవడానికి బయలుదేరిన విష్ణుకు ఆయన అందుబాటులో లేరని తెలియడంతో మార్గమధ్యంలోనే వెనుదిరిగారు. కెసిఆర్ ను కలుసుకోవడానికి గురువారంనాడు విష్ణు ఆయన ఇంటికి వచ్చారు. చాలా సేపు కెసిఆర్ కోసం నిరీక్షించారు. కెసిఆర్ బిజీగా ఉన్నారని వర్తమానం రావడంతో వెనుతిరిగారు.
ఖైరతాబాదు ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే విషయంపై తమను సంప్రదించకపోవడంతో పోటీకి దిగాలని తెరాస యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విష్ణు కెసిఆర్ ను కలవడానికి ప్రయత్నించారు. నాన్నగారంటే కెసిఆర్ కు గౌరవమని, తనకు కెసిఆర్ అంటే గౌరవమని విష్ణు మీడియా ప్రతినిధులతో చెప్పారు. పోటీ చేస్తామని కెసిఆర్ చెప్పలేదు కదా అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రెండు సార్లు సస్పెండ్ అయితా తమ తండ్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెసులోనే ఉన్నారని, తాను కంగ్రెసులోనే ఉంటానని ఆయన చెప్పారు. ఆ తర్వాత విష్ణు సిపిఐ కార్యదర్శి కె. నారాయణను, సిపిఎం కార్యదర్శి బి.వి. రాఘవులును కలుసుకుని ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరారు.












Click it and Unblock the Notifications
