అజీజ్ రెడ్డి బెదిరింపుల సంభాషణ
హైదరాబాద్: సహ నిర్మాత అభినవ్ రెడ్డితో విభేదాల కారణంగానే గ్యాంగ్ స్టర్ అజీజ్ రెడ్డి తనను బెదిరించాడని సినీ నిర్మాత నిఖిల్ రెడ్డి చెప్పారు. అభినవ్ రెడ్డి 40 లక్షల రూపాయలను నిఖిల్ రెడ్డి నుంచి రాబట్టుకోవడానికి అజీజ్ రెడ్డిని ఆశ్రయించాడని, దాంతో అజీజ్ రెడ్డి నిఖిల్ రెడ్డిని బెదిరిస్తూ వచ్చాడని అంటూ ఆదివారం దాదాపు అన్ని ప్రైవేట్ టీవీ చానెళ్లలో వార్తాకథనాలు ప్రసారమయ్యాయి. అజీజ్ రెడ్డికి, నికిల్ రెడ్డికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు చెందిన సీడీలు తమకు అందాయంటూ ఆ చానెళ్లు ఆ సంభాషణను ప్రసారం చేశాయి. సినీ రంగంలో నీపు చాలా చిన్నవాడివని, తన మాట వినకుంటే కైమా చేస్తానని అజీజ్ రెడ్డి బెదిరించినట్లు ఆ వార్తా కథనాల సారాంశం.
టీవీ చానెళ్లు ప్రసారం చేసిన వార్తా కథనాల ప్రకారం - నిఖిల్ రెడ్డి గతంలో అంగ్రేజ్ అనే సినిమా తీశారు. దాంతో విజయం సాధించడంతో దానికి సీక్వెల్ ను అంగ్రేజ్ - 2 పేరిట తీయాలని సంకల్పించాడు. దాంట్లో అభినవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పెట్టుబడి పెట్టారు. అయితే న్యాయపరమైన చిక్కుల వల్ల సినిమా నిర్మాణం ఆగిపోయింది. దాంతో అభినవ్ రెడ్డి నుంచి 40 లక్షల రూపాయలు రాబట్టుకోవడానికి అభినవ్ రెడ్డి ప్రయత్నించాడు. సినిమా విడుదలైతే తప్ప తాను డబ్బులు ఇవ్వలేనని నిఖిల్ రెడ్డి చెప్పారు. దాంతో అభినవ్ రెడ్డి అజీజ్ రెడ్డిని ఆశ్రయించారు.
డబ్బులు రాబట్టేందుకు అజీజ్ రెడ్డి నిఖిల్ రెడ్డి కార్యాలయానికి వెళ్లడమే కాకుండా ఫోనులో కూడా బెదిరించాడు. తన సంగతేమిటో సినిమావాళ్లందరికీ తెలుసు, హత్య చేయడానికి కూడా వెనకాడను అని అజీజ్ రెడ్డి బెదిరించాడు. దాంతో నిఖిల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు అజీజ్ రెడ్డి పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే అతను పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నిఖిల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications
