ప్రజాపథాన్ని బహిష్కరించిన కుతూహలమ్మ
చిత్తూరు: శాసనసభ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ ఆదివారం ప్రజాపథం కార్యక్రమాన్ని బహిష్కరించారు. అధికారులు తనకు సహకరించడం లేదంటూ ఆమె ఈ బహిష్కరణకు పూనుకున్నారు. గతంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను తాను పరిష్కారం కోసం అధికారులకు అందజేశానని, అయితే అధికారులు వాటిని పట్టించుకోలేదని కుతూహలమ్మ విమర్శించారు. దళితురాలిని అయినందుననే అధికారులు తనను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.
ఇందిరమ్మ గృహాల విషయంలో ఎఇ, ఎంపిడివోలపై ఆమె మండిపడ్డారు. ఎన్ని ఇందిరమ్మ గృహాలు ఇచ్చారో లెక్కలు చెప్పాలని ఆమె అధికారులను డిమాండు చేశారు. అధికారుల సహాయ నిరాకరణపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. అధికారుల తీరుపై ఆమె జిల్లా కలెక్టర్ రవిచంద్రకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని రవిచంద్ర చెప్పారు.












Click it and Unblock the Notifications
