ఆదిలాబాదులో నామినేషన్ల వీరుడు
ఆదిలాబాద్: తమిళనాడుకు చెందిన నామినేషన్ల వీరుడు డాక్టర్ పద్మరాజన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గానికి నామినేషన్ వేశారు. ఆయనకు ఎన్నికల్లో ఇది 91వ నామినేషన్. ఎన్నికలు వస్తే చాలు, ఏదో ఒక నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం అలవాటుగా చేసుకున్నాడు పద్మరాజన్. తమిళనాడులోని అత్తూరుకు చెందిన ఆయన 1988లో మొదటి సారి అత్తూరు నుంచి నామినేషన్ వేశారు. అప్పటి నుంచి ఆయన నామినేషన్లు వేసి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు.
ఆయన పోటీ చేసేది కూడా మామూలు అభ్యర్థుల మీద కాదు. హేమాహేమీల మీద ఆయన పోటీ చేస్తారు. స్వర్గీయ మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావు, బిజెపి నేత ఎల్.కె. అద్వానీ, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే. అయితే విజయం సాధించడానికి ఈ నామినేషన్లు వేయడం లేదు. ఈ విషయం ఆయనకూ తెలుసు. ఆయనకు ఇప్పటి వరకు వచ్చిన అత్యధిక ఓట్లు 5,120. చాలాసార్లు డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే ఓటర్లలో చైతన్యం కల్పించడానికే తాను నామినేషన్లు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. నామినేషన్లు వేయడంలో ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్నాడు. గిన్నిస్ బుక్కులోకి ఎక్కాలనేది ఆయన ఆశయం












Click it and Unblock the Notifications
