గొడవ మధ్య రాజ్యసభలో మహిళా బిల్లు
న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాలు, గొడవ మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి భరద్వాజ్ మహిళా బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రతిపాదించారు. పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం ఎట్టకేలకు రాజ్యసభలో ప్రతిపాదించింది. సభ ప్రారంభం కాగానే సమాజ్ వాది పార్టీ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి గొడవ చేశారు. రాజ్ థాకరే వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. మహిళా బిల్లు ప్రతిని మంత్రి భరద్వాజ్ చేతిలోంచి లాక్కోవడానికి ఎస్పీ సభ్యుడు అబు అసిం అజ్మీ, తన సహచరులతో కలిసి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని మంత్రి రేణుకా చౌదరి అడ్డుకున్నారు.
ప్రమాదాన్ని పసిగట్టిన భరద్వాజ్ ఇద్దరు మహిళా మంత్రులు కుమారి షెల్జా, అంబికా సోనీల మధ్య కూర్చున్నారు. కాంగ్రెస్ సభ్యులు జయంతి నటరాజన్, అల్కా బలరాం క్షత్రియ భరద్వాజ్ కు ఎస్పీ సభ్యుల నుంచి రక్షణగా నిలుచున్నారు. ఈ నాటకీయ పరిణామాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రతిపక్ష నాయకుడు జస్వంత్ సింగ్ లతో పాటు పలువురు చూస్తూ కూర్చున్నారు. మహిళా బిల్లును ఉపసంహరించుకోవాలని ఎస్పీ సభ్యులు నినాదాలు చేశారు. వారికి జెడి - యు సభ్యుల నుంచి మద్దతు లభించింది. మంత్రి బిల్లును ప్రతిపాదించగానే సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. మహిళా బిల్లు ఆమోదానికి 1996 నుంచి వివిధ ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే మహిళా రిజర్వేషన్లలోనూ బడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ, ఇతర కొన్ని పార్టీలు ఆ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.












Click it and Unblock the Notifications
