అజీజ్ రెడ్డి కేసు కొత్త మలుపు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ అజీజ్ రెడ్డి ఎన్ కౌంటర్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కొత్త ముఖాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ సమీపంలోని ఉప్పల్ ఆర్టీవో విజయ్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అజీజ్ రెడ్డిని తనకు విజయకుమార్ కుమారుడు వంశీ పరిచయం చేశాడని, ఏదో సాయం చేస్తాడని తనకు మిత్రుడైన వంశీకి చెప్పుకున్నానని, విషయం ఇంత సీరియస్ అవుతుందనుకోలేదని అంగ్రేజ్ - 2 సినిమాలో పెట్టుబడి పెట్టిన అభినవ్ రెడ్డి చెప్పారు. ఈ సినిమాకు తాను ఇచ్చిన 40 లక్షల రూపాయలను నిర్మాత తన నుంచి రాబట్టుకోవడానికి అభినవ్ రెడ్డి అజీజ్ రెడ్డిని ఆశ్రయించినట్లు, దీంతో అజీజ్ రెడ్డి తనను బెదిరించినట్లు నిఖిల్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
వంశీ అజీజ్ రెడ్డి సహాయంతో సెటిల్ మెంట్లకు కూడా పూనుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయకుమార్, వంశీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడుల సందర్భంగా ఆర్టీవో ఇంట్లో కొన్ని డ్రైవింగ్ లైసెన్సులు బయటపడడాన్ని బట్టి కూడా అజీజ్ రెడ్డితో గల సంబంధాలు తెలిసిపోతున్నట్లు భావిస్తున్నారు. అజీజ్ రెడ్డికి డ్రైవింగ్ లైసెన్సు ఇప్పించింది వంశీనే అని అనుకుంటున్నారు. అజీజ్ రెడ్డి వాడిన కారు అబూబకర్ ది. అభినవ్ రెడ్డి హైదరాబాదులోని హిమాయత్ నగర్ ప్రాంతంలో ఉంటున్నాడు. నేరాన్ని ప్రోత్సహించినందుకు అభినవ్ రెడ్డిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications
