తెలంగాణ యోధుడు బిఎన్ కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో మొదట ఆయుధం పట్టినవాడు, చివరగా ఆయుధం వదిలిపెట్టినవాడు ఆయనే. బి.ఎన్. రెడ్డిగా ఆయన సుప్రసిద్ధుడు. గ్రామస్థాయిలో ఆయన సాయుధ పోరాటాన్ని నడిపాడు.
నల్లగొండ జిల్లా మిర్యాలగుడా నియోజకవర్గం నుంచి 1957, 1976ల్లో రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1971, 1984, 1991ల్లో మూడు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. ఐక్య కమ్యూనిస్టు పార్టీ చీలిపోయినప్పుడు ఆయన సిపిఎం వైపు ఉన్నారు. ఆ తర్వాత కులసమస్యపై తన సహచరులతో బయటకు వచ్చి కమ్యూనిస్టు పార్టీని పెట్టారు. అయితే ఆ పార్టీ పెద్దగా ఆదరణ పొందలేదు. ఆయన తన పోరాట అనుభవాలతో ఆయువుపట్టు అనే నవల కూడా రాశారు.
బి.ఎన్. రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటింటారు. హోంమంత్రి కె. జానారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, బి.ఎన్. రెడ్డి మిత్రుడు, మాజీ ఎంపి ధర్మభిక్షం, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య బిఎన్ రెడ్డి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. బిఎన్ రెడ్డితో తనకు గల అనుబంధాన్ని జానారెడ్డి నెమరేసుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన బిఎన్ రెడ్డి భౌతిక కాయానికి శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని అంబర్ పేట స్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications
