జ్యోతిర్మయి హత్య: నిందితుడికి 'నో' బెయిల్
హైదరాబాద్: విజయవాడకు చెందిన జ్యోతిర్మయి విద్యార్థిని హత్య కేసులో నాగరాజ్ కుమార్ కు బెయిల్ ఇవ్వడానికి బర్మింగ్ హామ్ కోర్టు నిరాకరించింది. గాయాల పాలైన నాగరాజ కుమార్ ను ఆస్పత్రిలో చికిత్స చేయించి బర్మింగ్ హామ్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. నాగరాజ్ కుమార్ ను పోలీసులు ఒకటి రెండు సార్లు విచారించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. నాగరాజ్ కుమార్ జ్యోతిర్మయిని హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షి కూడా చెప్పాడు. జ్యోతిర్మయి, నాగరాజ కుమార్ ఒకేసారి బర్మింగ్ హామ్ వెళ్లినట్లు సమాచారం. వీరిద్దరు హైదరాబాదులోని ఖైరతాబాదులో గల ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫర్ యూ అనే సంస్థ ద్వారా బ్రిటన్ వెళ్లారు. ఈ కార్యాలయం ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. నాగరాజ్ కుమార్ వ్యక్తిగత వివరాలు వెల్లడించడానికి ఆ కార్యాలయం అధికారులు నిరాకరిస్తున్నారు.
నాగరాజ్ కుమార్ స్వస్థలం కరీంనగర్ జిల్లా గోదావరిఖని అని, ఈ కుటుంబం ప్రస్తుతం హైదరాబాదులోని జీడిమెట్లలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వారి ఇంట్లో ఎవరూ అందుబాటులో లేరు. నాగరాజ్ కుమార్ పాస్ పోర్టు 2006లో జారీ అయింది. తమ కూతురు మృతదేహం తమకు అప్పగిస్తే చాలునని జ్యోతిర్మయి తండ్రి సాయిబాబ అంటున్నారు. జ్యోతిర్మయి మృతదేహం రావడానికి వారం రోజులు పడుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications
