తెరాస కార్యకర్త దారుణ హత్య
వరంగల్: వరంగల్ జిల్లా శాయంపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త మొగిలిని కాంగ్రెస్ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ కార్యకర్తలు మొగిలిని గొడ్డలితో నరికి చంపారు. తెరాస ర్యాలీతో భగ్గుమన్న కాంగ్రెసు కార్యకర్తలు ఈ పనికి ఒడిగట్టారని తెరాస నాయకుడు వినోద్ కుమార్ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన మొగిలిని హైదరాబాదులోని నిమ్స్ కు తరలించారు. ఆస్పత్రిలో ఆయన మరణించారు. ఆయన మృతదేహాన్ని వరంగల్ లోని ఎంజిఎం అస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలోనూ ఫాక్షన్ హత్యలకు ఆజ్యం పోస్తున్నారని వినోద్ కుమార్ విమర్శించారు.
తమ పార్టీ కార్యకర్త మొగిలి హత్యపై కాంగ్రెసు మీద తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు భగ్గుమన్నారు. ఈ హత్య కేసులో దోషులపై చర్యలకు పూనుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మొగిలి హత్యకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరుడు కొండా మురళే కారణమని ఆయన ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్త హత్యలో దోషుల్ని అరెస్టు చేయకపోతే తెలంగాణ భగ్గుమంటుందని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్త హత్యకు నిరసనగా తెరాస రేపు వరంగల్లు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. గూండా రాజకీయాలతో తెలంగాణను అడ్డుకోలేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
