అయేషా కేసు: పోలీసు కస్టడీకి లడ్డూ
విజయవాడ: విజయవాడ విద్యార్థిని అయేషా హత్య కేసులో గుర్విందర్ సింగ్ అలియాస్ లడ్డూను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల పాటు లడ్డూను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం లడ్డూను 8 రోజుల పాటు ఈ నెల 23వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాజమండ్రి జైలులో ఉన్న లడ్డూను గురువారం సాయంత్రం ఐదు గంటలకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటారు. తిరిగి 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు కోర్టుకు అప్పగిస్తారు. లడ్డూపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, పూర్తి ఆరోగ్యవంతుడిగా అప్పగించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అయేషా హత్య కేసులో తన ప్రమేయం లేదని, ఈ కేసును అంగీకరిస్తే తనకు 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారని లడ్డూ ఇదివరకు అన్నారు. లడ్డూ పోలీసు కస్టడీపై అతని తండ్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకుకు పోలీసుల నుంచి ప్రమాదం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
