వరంగల్: తెలంగాణపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లకు చిత్తశుద్ధి లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. ఆదివారం రాత్రి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో బస చేసిన ఆయన సోమవారం వరంగల్ జిల్లాలో రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేశామని ఆయన చెప్పారు. ఓట్లు అడిగే హక్కు కేవలం కాంగ్రెసుకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యకు కాంగ్రెస్ ద్వారానే పరిష్కారం లభిస్తుందని, తెరాస కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. మరో రెండు నెలల్లో రేషన్ షాపుల ద్వారా 30 రూపాయలకు కిలో కందిపప్పు, 45 రూపాయలకు కిలో మంచినూనె సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.