రెండో రోజూ కోడెల శివప్రసాదరావు ధర్నా
గుంటూరు: తనపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారంటూ నర్సారావుపేట పోలీసు స్టేషన్ ముందు తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివప్రసాదరావు గురువారం రెండో రోజు కూడా తన ధర్నాను కొనసాగించారు. జిల్లా పోలీసు సూపరింటిండెంట్ వచ్చి క్షమాపణ చెప్పే వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆయన అంటున్నారు. తనపై బనాయించిన కేసును ఉపసంహరించుకోకపోతే పోలీసులపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన చెప్పారు.
తన వంటి ప్రముఖుడిపై ఒక అనామకుడు ఫిర్యాదు ఇచ్చినప్పుడు నిజానిజాలు తెలుసుకోకుండా కేసు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా దెబ్బ తీసేందుకే తనపై అక్రమ కేసు బనాయించారని ఆయన విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీతో తనకు సంబంధం లేదని గతంలో డియస్పీ నివేదిక ఇచ్చారని, కేసు పెట్టే సందర్బంలో పాత విషయాలను పరిగణనలోకి తీసుకోరా అని ఆయన అన్నారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేయకుండా ఎలా ఉంటామని ఎస్పీ లడ్హా అంటున్నారు. దర్యాప్తు తర్వాత కోడెల శివప్రసాదరావుకు సంబంధం లేదని తేలితే ఉపసంహరించుకుంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
