నన్ను బాధించింది: చంద్రబాబు

తెలంగాణ కోర్ కమిటీ సమావేశం చంద్రబాబు సమక్షంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో విజయనగరం జిల్లా దేవుపల్లి గ్రామంలో మీ కోసం యాత్ర బస్సులోనే ప్రారంభమైంది. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. తెలంగాణపై తమ పార్టీ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు తయారు చేసిన నివేదికను దేవేందర్ గౌడ్ చంద్రబాబుకు అందజేశారు. అలాగే తాను స్వయంగా చేయించిన సర్వే నివేదికను కూడా ఆయన అందజేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లోని 80 శాతం ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయని ఆయన చెప్పినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, సమైక్యవాదాన్ని బలపరుస్తున్న కమిటీ సభ్యులు యనమల రామకృష్ణుడు, కె.ఇ. కృష్ణమూర్తి, నాగం జనార్దన్ రెడ్డి సమావేశానికి ముందు విశాఖపట్నంలోని ఒక హోటల్ లో సమావేశమై తమ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. తెలంగాణపై వైఖరిని స్పష్టంగా చెప్పకపోయినా ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలను గెలిపించారని వారు చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం. పైగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నాయకులు సమైక్యనినాదంపైనే గెలిచామని అంటున్నారని వారు గుర్తు చేశారు. కమిటీ సమావేశమేదీ జరగకుండా తెలంగాణపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని మరో కమిటీ సభ్యుడు కె. ఎర్రంనాయుడు మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీ నాయకుడు కడియం శ్రీహరి చేసిన ప్రకటనల గురించి ప్రస్తావిస్తూ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎర్రంనాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications
