స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: పాలు, ధాన్యాలు, టీ, వంటనూనెలు, సబ్బులు, డిటర్జెంట్లు వంటి కొన్ని వినిమయ వస్తువుల అధిక ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచాయి. జూన్ 14తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం అంతకుముందు వారం కంటే స్వల్పంగా పెరిగి 11.42 శాతం వద్ద నిలిచింది. అంతకుముందు జూన్ 7తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 11.05 శాతం వద్ద ఉంది. తాజా వారాంతానికి ఇది 0.37 శాతం పెరిగింది. గత ఏడాది జూన్ రెండో వారాంతానికి ద్రవ్యోల్బణం 4.13 శాతం వద్ద ఉంది. 1995, మే 6 వారాంతానికి 11.11 శాతం నమోదు కాగా, ద్రవ్యోల్బణం ప్రస్తుతం ఆ రికార్డును అధిగమించింది. అదే ఏడాది మార్చిలో ద్రవ్యోల్బణం 16.9 శాతం నమోదయింది.
ఈవారంలో టీ ధర మూడు శాతం పెరగ్గా, పాలు ధర ఒక శాతం, పొద్దుతిరుగుడు నూనె నాలుగు శాతం, వనస్పతి రెండు శాతం, దిగుమతి చేసుకునే వంటనూనెల ధర ఒక శాతం పెరిగాయి. సబ్బులు, డిటర్జెంట్లు వంటి రోజూ ఉపయోగించే వస్తు ధరలు తొమ్మిది శాతం పెరిగాయి. తలనూనె ధర ఒక శాతం పెరిగింది. ఇంధన ధరలు, ముఖ్యంగా ల్యూబ్రికాంట్స్ ధర 19 శాతం పెరిగాయి. స్టీలు ఉత్పత్తులు ధరలు 25 శాతం నుంచి 36 శాతం వరకు పెరిగాయి. ద్రవ్యోల్బణం 13 ఏళ్ల గరిష్ట స్థాయిని నియంత్రించేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముందురోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మరికొన్ని రోజులు ద్రవ్యోల్బణం రెండంకెల్లోనే ఉంటుందని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications
