ఎమ్మెల్యే చనుమోలు కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు చనుమోలు వెంకట్రావు మంగళవారం హైదరాబాదులోని కేర్ అస్పత్రిలో కన్ను మూశారు. ఆయనకు 76 ఏళ్ల వయస్సు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నెల రోజులుగా ఆయన మూత్రపిండ వ్యాధులకు కేర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.
ఆయన ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కోట్ల భాస్కర రెడ్డి, జలగం వెంగళరావు, టి. అంజయ్యల మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు. ఆయన 1932 ఫిబ్రవరి 10వ తేదీన కృష్ణా జిల్లా వెలగటూరులో జన్మించారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరుగుతాయి. చనుమోలు వెంకట్రావు మృతికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications