రాష్ట్రపతికి ఎస్పీ మద్దతు లేఖ
న్యూఢిల్లీ: మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ సమాజ్ వాదీ పార్టీ బుధవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ లేఖను అందజేసింది. యుపిఎకు మద్దతు తెలిపే విషయంలో పార్టీ పార్లమెంటు సభ్యుల్లో చీలికలున్నాయనే వార్తల నేపథ్యంలో 40 మంది సభ్యుల సంతకాలతో సమాజ్ వాదీ పార్టీ ఆ లేఖను అందజేసింది. తమకు, యుపిఎకు మధ్య విభేదాలున్నాయనే సందేహాలను నివృత్తి చేస్తూ తాము రాష్ట్రపతిని కలిశామని సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ తెలిపారు. రాష్ట్రపతిని కలిసి లేఖ అందజేసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాంగోపాల్ వర్మతో కలిసి అమర్ సింగ్ రాష్ట్రపతికి లేఖను అందజేశారు. తమ వైఖరిని, యుపిఎకు మద్దతు ఇవ్వాలని తమ గత నిర్ణయాన్ని తాము పునరుద్ఘాటించినట్లు అమర్ సింగ్ చెప్పారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన పార్లమెంటు సభ్యుల పేర్లతో రాష్ట్రపతికి లేఖ అందజేశామని, పార్టీ విప్ ను వారు పాటిస్తారని ఆయన చెప్పారు. తిరుగుబాటు ఎంపిలు బేని ప్రసాద్ వర్మ, అతిక్ అహ్మద్ కూడా యుపిఎకు మద్దతిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వారితో తాను మాట్లాడినట్లు ఆయన చెప్పారు. స్వతంత్ర ఎంపి బాలేశ్వర్ యాదవ్ కూడా ప్రభుత్వాన్ని బలపరుస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
