విద్యుత్ కోతపై టిడిపి ఆందోళన
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ కోతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఆందోళనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని విద్యుత్ కార్యాలయాలను, సబ్ స్టేషన్లను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు చోట్ల పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్టులు చేశారు. పలు చోట్ల తెలుగుదేశం నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
హైదరాబాదులోని విద్యుత్ సౌధను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఎర్రబెల్లి దయాకరరావు, తలసాని శ్రీనివాస యాదవ్ నేతృత్వంలో ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. కార్యకర్తలు విద్యుత్ సౌధలోనికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ధర్నాతో ట్రాపిక్ స్తంభించింది. కరెంట్ కోతపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ఆర్థిక మంత్రి రోశయ్య వివరణ ఇవ్వాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు. నాలుగు రోజుల్లో విద్యుత్ కోతను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు.












Click it and Unblock the Notifications
