యుపిఎకు వ్యతిరేకంగా ఓటు: కెసిఆర్
హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన జరిగే బలపరీక్షలో ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ)కి వ్యతిరేకంగా ఓటు వేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చెప్పారు. తెరాసకు ఇద్దరు పార్లమెంటు సభ్యులున్నారు. తెలంగాణపై నిర్ణయం ప్రకటించనందుకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు చంద్రశేఖరరావు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వామపక్షాలు తెలంగాణకు అడ్డుగా ఉన్నాయని చెప్పిన కాంగ్రెస్ ఆ పక్షాలు వెళ్లిపోయిన తర్వాత తెలంగాణపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన అడిగారు.
తమను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీకి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్ కు లేదని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు పట్టుబడితే తెలంగాణపై నిర్ణయం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. జాతీయ సమస్య పేరుతో తెలంగాణ అంశాన్ని తెలంగాణ ఎంపీలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలను నిలదీసే హక్కు ప్రజలకు ఉందని, తమకు కూడా ఉందని, ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ ఎంపీల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 18వ తేదీన విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
