మైత్రికి విఘాతం కాంగ్రెస్, ప్రధాని : కారత్
కోల్‌కత : కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడానికి కాంగ్రెస్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కారణమని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందంపై ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో లెఫ్ట్ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన సంగతి తెలిసిందే.
యూపీఏ- లెఫ్ట్ భాగస్వామ్యం దెబ్బతినడానికి కాంగ్రెస్, ప్రధాని కారణమని కారత్ పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం కేంద్రంలో లౌకికవాద ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తమ మధ్య అంకురించిన సంబంధాలు తెగిపోవడానికి కాంగ్రెస్, ప్రధానిదే బాధ్యతని చెప్పారు. సీపీఎం పత్రిక గణశక్తిలో కారత్ ఈ మేరకు అభిప్రాయాలు వెలిబుచ్చారు. లెఫ్ట్ పార్టీలు ఎన్నడూ రాజీపడనటువంటి అణు ఒప్పందాన్ని అమల్లోకి తేవాలనుకోవడం వలనే కేంద్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని కారత్ అభిప్రాయపడ్డారు.
ప్రమాదరమైన అమెరికా సామ్రాజ్యవాదం దాగివుండటం వలన తాము ఈ ఒప్పందాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అణు ఒప్పందంపై ప్రతిపక్ష బీజేపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించడానికి తమకు ఎటువంటి సారూప్యతలేదని కారత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భారత్ అణ్వాయుధాలు తయారు చేసుకునే అవకాశం కోల్పోతుందనే ఒక్క కోణంలోనే ఈ ఒప్పందాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు












Click it and Unblock the Notifications
