రాత్రి విద్యుత్ కోత ఉండదు: షబ్బీర్
హైదరాబాద్: రాత్రిపూట విద్యుత్ కోత ఉండదని విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. ఎన్టీపిసి సింహాద్రి యూనిట్ నుంచి వేయి మెగావాట్ల విద్యుత్తును అదనంగా ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రమంతటా మంచి వర్షాలు పడతాయని ఆశిస్తున్నామని, దీని వల్ల జలాశయాల్లోకి నీరు చేరి జల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి పెరుగుతుందని ఆయన అన్నారు. నిరుటితో పోల్చుకుంటే ఈ ఏడాది విద్యుత్తు వాడకం పెరిగిందని ఆయన చెప్పారు.
ఆరోగ్యశ్రీ రెండో దశ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించామని, దీన్ని రేపు యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. దీనికి 950 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, ఇందులో 450 కోట్లు బడ్జెట్లో పెట్టామని, మిగతా 400 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 90 శాతం మంది ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం కిందికి వస్తారని ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం వల్ల గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు కూడా లాభం చేకూరుతుందని, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్పత్రుల సిబ్బందికి అందజేస్తామని ఆయన చెప్పారు. ఆరోగ్యశాఖలో స్త్రీపురుష ఉద్యోగుల మధ్య ప్రమోషన్లలో ఉన్న వ్యత్యాసాలను తొలగిస్తామని, మహిళా ఉద్యోగులకు త్వరగా ప్రమోషన్లు లభించే చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్ చెప్పారు.
ఆగస్టు 18 నుంచి 29 వరకు శాసనసభ వర్షాకాలం సమావేశాలు నిర్ణయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ రాజకీయాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఏం జరుగుతుందో వేచి చూద్దామని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రులతో అన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
