మహబూబ్‌నగర్: పంటలకే సరిగ్గా విద్యుత్‌ను సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు ఎలా ఇస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కమీషన్ల కోసమే ప్రభుత్వం అంచనాలను పెంచుతోందని ఆయన దుయ్యబట్టారు. మీకోసం యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని గుడ్డెందొడ్డిలో ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రదేశాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎత్తిపోతల పథకాల్లో అనేక లోపాలున్నాయని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎరువుల కోసం వచ్చి మృతి చెందిన రైతు కుటుంబానికి ఆయన సానుభూతి తెలిపారు. ఢిల్లీలోనే కాకుండా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అరాచకాలు అధికమయ్యాయని ఆయన మండిపడ్డారు.