ఒంగోలు: రాష్ట్రంలో కొత్తగా ఏ పార్టీ ఏర్పాటైనా తాము భయపడమని ఆర్థిక శాఖామంత్రి రోశయ్య తెలిపారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, దీన్ని పడగొట్టేందుకు ఏ పార్టీ వచ్చినా బెదరమని ఆయన అన్నారు. బుధవారం ఆయన కనిగిరిలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మహాకూటమి ఏర్పాటు చేసినా, చిరంజీవి పార్టీ పెట్టినా ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలు ఏర్పాటు చేసుకోవడానికి అందరికీ స్వేచ్ఛ ఉందని, కాంగ్రెస్ పార్టీకి ఎవరూ శత్రువులు కారని చెప్పారు. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని రోశయ్య తెలిపారు.