ఆరోగ్యశ్రీపై చర్చకు సిద్ధం: వైయస్
విశాఖపట్నం: ఆరోగ్యశ్రీపై శాసనసభలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరాన్ని ఆయన మంగళవారం ఇక్కడ ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ మంచిది కాదని వాదిస్తున్నవారు శాసనసభలో చర్చకు సిద్ధం కావాలని ఆయన సవాల్ చేశారు. బహిరంగ చర్చకు శాసనసభను మించిన వేదిక లేదని ఆయన అన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తున్నప్పుడు కొద్దిగా లోపాలు జరిగే అవకాశం లేకపోలేదని, వాటిని తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. కార్పోరేట్ ఆస్పత్రులు వైద్య చికిత్స చేయించుకోగలమని పేదలు ఏనాడైనా అనుకున్నారా అని, ఇప్పుడు అది సాధ్యమవుతోందని ఆయన అన్నారు.
పేదలకు వైద్యం అందించడానికి ఎంత ఖర్చయినా భరిస్తామని, పేదలను పట్టించుకోని ప్రభుత్వాలను మనుగడ సాధించలేవని ఆయన అన్నారు. పేదలను ఆదుకునేందుకే ఆరోగ్యశ్రీని ప్రారంభించామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 425 కోట్ల రూపాయలతో 20 వేల మందికి వైద్య సహాయం అందించామని ఆయన చెప్పారు. 346 ఆస్పత్రుల్లో 3400 మంది చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. పేదలకు 6 లక్షల ఎకరాల భూమి పంచుతామని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వచ్చేనాటికే రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
