తిరుపతి నుంచే చిరు యాత్ర
హైదరాబాద్: తిరుపతిలోనే మెగాస్టార్ చిరంజీవి మొదటి బహిరంగ సభ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి తన రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వేదికను ఎంపిక చేయడానికి చిరంజీవి బావ మరిది, సినీ నిర్మాత అల్లు అరవింద్ తిరుపతిలోని వివిధ ప్రదేశాలను పరిశీలించారు. తిరుపతిలో నాలుగు ప్రదేశాలను అల్లు అరవింద్ బుధవారంనాడు పరిశీలించారు. చిరంజీవి తిరుపతి నుంచే పోటీ చేయవచ్చునని కూడా ప్రచారం జరుగుతోంది.
వేదిక ఎంపిక కోసం తిరుపతి వచ్చిన అల్లు అరవింద్ గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. చిరంజీవి ఈ నెల 22వ తేదీన గానీ, 26న గానీ పార్టీని అధికారికంగా ప్రకటించవచ్చునని తెలుస్తోంది. అయితే ఆగస్టు 15వ తేదీ కూడా ఆయన ఆలోచనలో ఉంది. బహిరంగ సభకు ముందే హైదరాబాదులో తన పార్టీకి సంబంధించిన వివరాలను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల ఆయన కొద్ది మంది పాత్రికేయులతో మాట్లాడారు. ఆగస్టు మూడో వారంలో తన పార్టీ వివరాలను తెలియజేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications