సత్యంబాబు అరెస్టుపై ధర్నా
విజయవాడ: విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అతని బంధువులు, అనాసాగరం గ్రామస్థులు నందిగామలో బుధవారం ఆందోళనకు దిగారు. నందిగామ డిఎస్పీ కార్యాలయం వద్ద ధర్నాకు చేశారు. అంతకు ముందు వారు ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించారు. అయేషా హత్య కేసులో సత్యంబాబును పోలీసులు ఇరికిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. సత్యంబాబు అమాయకుడని, అతని మానసిక స్థితి కూడా బాగా లేదని వారంటున్నారు.
సత్యంబాబు చిల్లర దొంగతనాలు మాత్రమే చేస్తూ వచ్చాడని, సెల్ ఫోన్ దొంగతనం కేసులో ఆరు నెలలు జైల్లో ఉండి వచ్చాడని వారు చెబుతున్నారు. సత్యంబాబును విచారిస్తున్నామని, విచారణ అనంతరం వదిలేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో వారు అనాసాగరం బయలుదేరి వెళ్లారు. సత్యంబాబును తన కూతురు హత్య కేసులో నిందితుడిగా చూపడాన్ని అయేషా తల్లి వ్యతిరేకిస్తోంది. జైల్లో ఉన్న వ్యక్తి ఎలా హత్య చేస్తాడని ఆమె ప్రశ్నించింది. అసలు నిందితులను తప్పించడానికి ఎవరెవరినో తెచ్చి నిందితులుగా చూపుతున్నారని ఆమె అంటోంది. మంత్రి కోనేరు రంగారావు మనవడు సతీష్, ఇతరులు తన కూతురు హత్య కేసులో నిందితులని ఆమె అంటోంది.












Click it and Unblock the Notifications