IPL 2026: మలుపు తిప్పిన సిరాజ్.. చిత్తుగా ఓడిన రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ విజయాన్ని అందుకుంది. శనివారం జైపూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ సత్తా చాటితే.. బౌలింగ్‌లో రషీద్ ఖాన్ తన స్పిన్‌తో మ్యాచ్‌ను తిప్పేసాడు.
ఈ గెలుపుతో గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ప్లే ఆఫ్స్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు రాజస్థాన్ ఐదో స్థానానికి పడిపోయి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.

రఫ్ఫాడించిన రషీద్ ఖాన్..
229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రవీంద్ర జడేజా(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) మినహా అంతా విఫలమయ్యారు. రషీద్ ఖాన్(4/33) నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించగా.. జాసన్ హోల్డర్(3/12) మూడు వికెట్లు తీసాడు. కగిసో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా..మహమ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. యష్‌రాజ్ పుంజా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
మలుపు తిప్పిన సిరాజ్..
బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినా.. బౌలింగ్‌లో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లతో నిప్పులు చెరిగినా.. మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు గెలుపు బాట వేసాడు. డేంజరస్ ఓపెనర్, సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీని పవర్ ప్లేలోనే ఔట్ చేసి మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్ వైపు మలుపు తిప్పాడు. వైభవ్ సూర్యవంశీనే సిరాజ్ ఔట్ చేయకుండా ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. కనీసం పవర్ ప్లే పూర్తయ్యే వరకు వైభవ్ క్రీజులో ఉన్నా మ్యాచ్‌ను లాగేసుకునేవాడు. దాంతోనే ఈ గెలుపు క్రెడిట్ సిరాజ్‌దేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications