చిరు వివాదం: చెన్నకృష్ణయ్య రాజీ
న్యూఢిల్లీ: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వివాదం కొలిక్కి వస్తుందా? ప్రజారాజ్యం పేరుతో పార్టీని రిజిష్టర్ చేయించుకోవడానికి ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్న కడప జిల్లా న్యాయవాది చెన్న కృష్ణయ్య శుక్రవారం ఢిల్లీలో దర్శనమిచ్చారు. ఆయన ఎన్నికల సంఘం అధికారులను కలుసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ వ్యవహారంపై నిర్ణయాన్ని ఎన్నికల సంఘం వచ్చే నెలకు వాయిదా వేసింది. చిరంజీవి వర్గాలతో చెన్నకృష్ణయ్య రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో చెన్నకృష్ణయ్య తన దరఖాస్తు చేసుకున్న పార్టీ పేరును ఉపసంహరించుకున్నారు. అయితే తాము చెన్నకృష్ణయ్యతో తాము ఎటువంటి చర్చలు జరపలేదని, ఎన్నికల సంఘం తగిన పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటుందని ప్రజారాజ్యం అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా అన్నారు.
ప్రజారాజ్యం పేరుతో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన చెన్నక్రిష్ణయ్య అనే న్యాయవాది పార్టీని రిజిష్టర్ చేయించారనే వార్తలు రావడంతో ఒక్కసారిగా కలకలం బయలుదేరింది. తాను ప్రజారాజ్యం పార్టీని స్థాపించినట్లు చిరంజీవి బహిరంగసభకు ఒక రోజు ముందు ఈ నెల 25వ తేదీన వార్త వచ్చేట్లు చూసుకుని ఆ న్యాయవాది కనిపించకుండా పోయాడు. ప్రజారాజ్యం పేర పార్టీ రిజిష్టర్ కోసం చెన్నక్రిష్ణయ్య ఈ ఏడాది మార్చిలో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. దానికి అవసరమైన పత్రాలు పంపాలని ఈ నెల 13వ తేదీన చెన్న క్రిష్ణయ్యకు ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చినట్లు సమాచారం. చెన్నక్రిష్ణయకు తాము సమాధానం రాశామని చెప్పిన ఎన్నికల సంఘం ఏం సమాధానం పంపామనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించింది. ప్రజారాజ్యం పేర ఇప్పటి వరకు పార్టీ రిజిష్టర్ కాలేదని కూడా స్పష్టం చేసింది. అయితే చెన్నక్రిష్ణయ్య దరఖాస్తును ప్రాసెస్ చేశామని ఎన్నికల సంఘం అధికార వర్గాలు చెప్పాయి.
చెన్నక్రిష్ణయ్య ఇంటికి చిరంజీవి అభిమానులు వెళ్లి ఆరా తీయడానికి ప్రయత్నించారు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. దీంతో చెన్నక్రిష్ణయ్య కుటుంబ సభ్యులు కూడా ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. అయితే తమ పార్టీ రిజిష్ట్రేషన్ కు ఏ విధమైన ఇబ్బందులు ఉండవని భావిస్తున్నట్లు ప్రజారాజ్యం అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా అంటున్నారు.
కాగా, చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం రిజిస్ట్రేషన్ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. చిరంజీవి తన పార్టీ పేరు నమోదుకు ఈ నెల 26వ తేదీన ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే పార్టీ నమోదుకు 100 మంది సంతకాలు కావాల్సి ఉండగా 88 మంది సంతకాలతోనే ఆయన దరఖాస్తును ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు సమాచారం. తన లక్కీనెంబర్ 8 కావడంతో ఆయన ఇలా చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications