మామునూరు ఎయిర్ పోర్ట్ పనులలో కీలక అడుగు.. ఆ పనులకు టెండర్లు!
ఓరుగల్లు వాసుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన ముగించిన అనంతరం విమానాశ్రయ ప్రాథమిక అభివృద్ధి పనుల కోసం కీలకమైన టెండర్లను ఆహ్వానించారు. ఇది ఓరుగల్లు పారిశ్రామిక, రవాణా రంగాల్లో కొత్త జవసత్వాలను నింపే ముందడుగుగా మారనుంది.
మామునూరు ఎయిర్పోర్ట్ రన్‌వే విస్తరణకు శ్రీకారం
ఎయిర్ పోర్ట్ సరిహద్దుల రక్షణ మరియు జంగిల్ క్లియరెన్స్ పనులు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.ఈ ఎయిర్ పోర్ట్ లో అత్యంత ప్రాధాన్యత కలిగిన రన్‌వే విస్తరణకు ప్రాధికార సంస్థ శ్రీకారం చుట్టింది. భూ నిర్వాసితుల నుండి సేకరించిన రన్‌వే స్థలానికి రక్షణగా ఫెన్సింగ్ (కంచె) వేయడం, ప్రభుత్వ అధికారిక బోర్డులను ఏర్పాటు చేయడం వంటి పనులు ఈ టెండర్ ద్వారా జరగనున్నాయి.

ముళ్ళపొదలు, చెట్ల తొలగింపుతోపాటు ఆ పనులకు టెండర్లు
దీనితో పాటు, విమానాశ్రయ అంతర్గత ప్రాంగణంలో దట్టంగా ఏపుగా పెరిగిన ముళ్లపొదలు, ఇతర చెట్ల తొలగింపు పనులను కూడా కాంట్రాక్టర్ చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్లియరెన్స్ పనులు విమానాశ్రయ నిర్మాణ స్థలాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తాయి.విమానాశ్రయంలో ఆధునిక రన్‌వే మరియు టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి సాంకేతికంగా అత్యంత కీలకమైన భూసార పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
భూసార పరీక్షలు, పర్యావరణ అనుమతులకు టెండర్లు
పర్యావరణ అనుమతులు సాధించడం, భూసార పరీక్షలు పూర్తి చేయడం వంటి బాధ్యతలను ఈ టెండర్లు దక్కించుకున్న సంస్థకు అప్పగిస్తారు. ఈ మౌలిక వసతుల పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. షెడ్యూల్ ప్రకారం నేడు సాయంత్రం 5 గంటలకు టెండర్లను అధికారులు ఫైనల్ చేయనున్నారు.టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సంస్థ ఖచ్చితంగా 180 రోజుల (ఆరు నెలల) కాలపరిమితిలోనే ఈ అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసి నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది.
రూ.850 కోట్ల భారీ బడ్జెట్‌తో మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.295 కోట్ల వ్యయంతో సేకరించిన 253 ఎకరాల అదనపు భూమిని కలిపి మొత్తం 950 ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అధికారికంగా అప్పగించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్టును సుమారు రూ.850 కోట్ల భారీ బడ్జెట్‌తో చేపట్టనున్నారు.
కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చే పనిలో ఏఏఐ
త్వరలోనే పూర్తి స్థాయి నిర్మాణ టెండర్లను పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని ఉడాన్ పథకం కింద కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌గా మారుస్తారు. రాబోయే రెండేళ్లలో పనులు పూర్తి చేసి, వరంగల్ నుండి విమాన సర్వీసులు ప్రారంభించడమే లక్ష్యంగా యంత్రాంగం పరుగులు పెడుతోంది.













Click it and Unblock the Notifications