ఒంగోలులో టిడిపి మహాధర్నా సక్సెస్
ఒంగోలు: ఎరువుల కొరతపై శనివారం సాయంత్రం ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. రైతులకు ఎరువులు అందించలేని ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని శనివారం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైఎస్ ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు సరఫరా చేయలేకపోతోందని, చేతకాకపోతే దిగిపోవాలని బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండు రోజుల్లో అవసరమైన ఎరువులు సరఫరా చేయకపోతే అక్రమ నిల్వలపై దాడులు చేస్తామని బాబు హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో ఎరువుల కొరతగా నిరసనగా పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న చంద్రబాబు వైఎస్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయలేక, అవసరమైన మేర ఎరువులు ఇవ్వలేక ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తోందని బాబు అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుల ప్రైవేటు, బ్యాంకు రుణాలు అన్నిటినీ మాఫీ చేస్తామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications