వరంగల్లో ఇద్దరు రౌడీ షీటర్ల హతం
వరంగల్: వరంగల్లోని ఉర్సుగుట్ట ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు రౌడీషీటర్లు హతమయ్యారు. గడ్డం జగన్, అడ్డపల్లి రత్నాకర్ అనే ఇద్దరు రౌడీ షీటర్లు హతమైనట్లు పోలీసులు చెప్పారు. వీరిద్దరికీ ఆరు హత్యకేసులతో సంబంధం ఉంది. ఉప్పల్ పోలీసు స్టేషనులో నాగరాజు అనే వ్యక్తి హత్యకేసులో వీరిద్దరు హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఉంటున్నారు.
ఒక కేసులో వరంగల్ కోర్టులో హాజరు పరిచేందుకు పిటి వారంట్ పై తీసుకుని వెళ్తుండగా రఘునాథపల్లి వద్ద తమ నుంచి తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వారి కోసం గాలిస్తుండగా ఉర్సుగుట్ట వద్ద తారసపడ్డారని చెప్పారు. లొంగిపోవాలని అడగ్గా వారు సబ్ ఇన్ స్పెక్టర్ వద్ద ఉన్న రివాల్వర్ లాక్కుని కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారని, ఈ సమయంలో తాము ఎదురు కాల్పులు జరిపామని, ఈ ఎదురు కాల్పుల్లో వారిద్దరు మరణించారని పోలీసులు వివరిస్తున్నారు.
అయితే, వారిద్దరిది బూటకపు ఎన్ కౌంటర్ అని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్లో గత కొంత కాలంగా రెండు రౌడీ ముఠాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో ఇరు వైపులా దారుణమైన హత్యలు చోటుచేసుకున్నాయి. ఒక ముఠాకు గడ్డం జగన్ నాయకత్వం వహిస్తున్నాడు.












Click it and Unblock the Notifications