టిడిపి నేతలకు 'మహా' ఆటంకాలు
నిజామాబాద్: మహారాష్ట్ర పోలీసులు మీడియాతో తెలుగుదేశం పార్టీ నాయకులు బాబ్లీ ప్రాజెక్టును సందర్శించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం నాయకులు రెండు బృందాలుగా విడిపోయి బాబ్లీ ప్రాజెక్టును చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బృందం కాలినడకను బాబ్లీ ప్రాజెక్టుకు చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరో బృందం నాటు పడవల్లో అక్కడికి ప్రయాణమయ్యారు. బాబ్లీవైపు ఎవరు వెళ్లడానికి ప్రయత్నించినా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
బాబ్లీతో సహా 12 ప్రాజెక్టులను మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోందంటూ ఆయా ప్రాజెక్టులను టీడీపీ నేతలు సందర్శించారు. చివరగా బాబ్లీ పర్యటనకు మంగళవారం సాయంత్రం వెళ్లగా కరెంటు లేక వెనుతిరిగారు. రాత్రి బాసరలో బసచేసి బుధవారం కాలినడకన బాబ్లీకి బయలుదేరారు. వీరి రాకను అడ్డుకునేందుకు బాబ్లీ పరిరక్షణ సమితి కార్యకర్తలు కూడా అక్కడకు బయలుదేరారు. దీంతో పోలీసులు సరిహద్దుల్లో 144 సెక్షన్ విధించారు. న్యాయమూర్తి అనుమతి తీసుకుని వస్తేనే టీడీపీ నేతలను బాబ్లీకి అనుమతిస్తామని అన్నారు. భారీగా పోలీసులను అక్కడ మోహరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications