న్యూయార్క్: ఇప్పటికే అమెరికాలో ఒబామాను అంతా కెన్నెడీతో పోల్చుతున్నారు. మరో ప్రక్క కెన్నడీ కుమార్తెకు ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించనుండటం తో అంతటా ఆసక్తి నెలకొంది. ఒబామా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే ఆయనతోపాటు క్యాబినెట్ కూడా బాధ్యతలు స్వీకరించనుంది. ఇది చాలా క్యాజువల్ గా జరిగే సహజ పరిణామమే. అయితే ఈ సారి మాత్రం ఈ ప్రక్రియలో ఓ ఆసక్తికరమైన అంశం చోటు చేసుకోనుంది. విదేశాంగమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిల్లరీ క్లింటన్ సెనేటర్‌గా రాజీనామా చేస్తారు. ఆ స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్.ఎఫ్.కెన్నడీ కుమార్తె కరోలిన్ కెన్నెడీ ఎన్నికవబోతున్నారన్నదే ఆ ఆసక్తికరమైన అంశం. మన్‌హట్టన్‌లో లాయర్‌గా పనిచేస్తున్న కరోలిన్ కెన్నెడీ ఒబామాకు సన్నిహితురాలు, సలహాదారు కూడా. సెనేటర్‌గా హిల్లరీ వారసురాలిని నామినేట్ చేయవలసిన న్యూయార్క్ గవర్నర్ డేవిడ్ ఎ ప్యాటర్‌సన్‌తో కరోలిన్ ఇప్పటికే మాట్లాడారు. ఇతరుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నా ఆమె పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.