లోకసభలో బాబ్లీ ప్రాజెక్టు లొల్లి
న్యూఢిల్లీ: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీతో సహా ఇతర ప్రాజెక్టుల పరిశీలనకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నాయకుడు కె. ఎర్రంనాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోకసభ జీరో అవర్ లో ఆయన శుక్రవారం బాబ్లీ ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తారు. మహారాష్ట్ర అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. తమ పార్టీ నాయకులు సందర్శించిన తర్వాతనే ప్రభుత్వం బాబ్లీ విషయంపై దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు.
కాంగ్రెసు ప్రభుత్వం హయాంలోనే బాబ్లీ నిర్మాణం ప్రారంభమైందని ఆయన అన్నారు. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రతిస్పందించాలని తెలుగుదేశం సభ్యులతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు పట్టుబట్టారు. వారు మాట్లాడే విషయాలేవీ రికార్డుల్లోకి వెళ్లవని అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ చెప్పారు. జీరో అవరులో లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడలేదు.
అంతకు ముందు శక్రవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, తదితర ప్రాజెక్టులపై చర్చకు టీడీపీ తీర్మానం ప్రవేశపెట్టింది. ఇది ఆ ప్రాంత వాసులకు అత్యంత ముఖ్యమైన సమస్య కనుక లోక్‌సభలో చర్చకు అనుమతించాలని టీడీపీ కోరగా స్పీకర్ తిరస్కరించారు.












Click it and Unblock the Notifications