బుజ్జితో పెళ్లి కాలేదు: భార్గవి తండ్రి
గుంటూరు: తన కూతురుకు ప్రవీణ్ కుమార్ అలియాస్ బుజ్జితో వివాహం అయినట్లు వచ్చిన వార్తలను నటి భార్గవి తండ్రి ప్రసాదరావు ఖండిస్తున్నారు. బుజ్జి తమ వద్దకు వస్తూ ఉండేవాడని, అయితే అతనితో భార్గవికి ఏ విధమైన సంబంధాలు లేవని ఆయన అంటున్నారు. భార్గవి సరిగమప కార్యక్రమంలో పాల్గొన్న 24 గంటల్లోపలే ఈ విషాద సంఘటన జరిగిందని ఆయన అంటున్నారు. తన కూతురు మరణంపై తనకు ఫోన్ చేశారని, మొదట తనకేమీ అర్థం కాలేదని ఆయన అన్నారు.
భార్గవి తల్లిదండ్రులు భానుమతి, ప్రసాదరావు స్వస్థలం గుంటూరు జిల్లా గోరంట్ల నుంచి హైదరాబాదుకు బయలుదేరారు. భార్గవి డిగ్రీ చదువుతూ మధ్యలోనే కళాశాలకు మానేసింది. ఆ తర్వాత టీవీ యాంకరుగా పని చేస్తూ వచ్చింది. బుజ్జి ఆర్కెస్ట్రాలో ఆమె పని చేస్తూ వచ్చింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో పని చేస్తూ వచ్చింది. అష్టా చెమ్మా చిత్రంతో ఆమె అకస్మాత్తుగా ఎదిగిపోయింది. ప్రవీణ్ కుమార్ భార్గవిని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడని డిసిపి రవివర్మ చెబుతున్నారు. ఇంకా దర్యాప్తు సాగిస్తున్నామని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.
ప్రవీణ్ కుమార్ తో కలిసే భార్గవి నెల్లూరులో అష్టాచెమ్మా సినిమా చూశారని, వారిద్దరు కలిసి నెల్లూరులో ఒక కార్యక్రమం కూడా ఇచ్చారని తెలుస్తోంది. అయితే, అష్టాచెమ్మా విజయంతో భార్గవి తల్లి ప్రవీణ్ కుమార్ ను అవమానించినట్లు తెలుస్తోంది. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. దాంతో పథకం ప్రకారమే ప్రవీణ్ కుమార్ భార్గవి ఇంటికి ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో వచ్చారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications