సిఎం ఇంటి వద్ద ఎమ్మార్పీయస్ ఆందోళన
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కార్యకర్తలు గురువారంనాడు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ఢిల్లీ వెళ్లాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారంనాటికి నాలుగో రోజుకు చేరుకుంది. మందకృష్ణ మాదిగకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీయస్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రాస్తారోకో నిర్వహించారు. విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఎమ్మార్పీయస్ కార్యకర్తలు రాస్తోరోకో నిర్వహించారు. ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా రాస్తారోకోలకు దిగారు. వరంగల్లులో ముగ్గురు ఎమ్మార్పీయస్ కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి దిగారు.












Click it and Unblock the Notifications