హైదరాబాద్: నల్గొండలో శనివారం రాత్రి నిర్వహించిన సభకు పోలీసులు ఇబ్బంది కలిగించడం దురదృష్టకరమని ప్రజారాజ్యం కోర్‌కమిటీ సభ్యుడు ఆంజనేయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ వర్తింపజేయని నిబంధనల్ని చిరంజీవి సభలకే విధించడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై డీజీపీ, ఎస్పీలతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసుల వ్యవహార శైలిని ఖండిస్తూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ప్రరాపా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా 'మీకోసం' యాత్రలో అర్ధరాత్రి 2 గంటల వరకు కార్యక్రమాలు జరిగాయని, కాంగ్రెసు కూడా అర్ధరాత్రి వరకు సభలు నిర్వహిస్తోందని చెప్పారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచే తమ పట్ల ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు సభలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని ఎస్పీ చెప్పారన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పింది? చట్టాన్ని ఏమైనా మార్చారా? అని ఆంజనేయరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం కావాలనే రోడ్డు షోలపై పీఐఎల్ వేయించిందని, ఇప్పుడు సభలు జరగకుండా ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.