ఏది సత్యం, ఏది అసత్యం రాజుగారూ!

బుధవారం ఉదయం వరకూ ఈ సూత్రాలు కొన్ని వేల మంది ఐటీ నిపుణులను ముందుకు నడిపించే ఉత్ప్రేరకాలు. ఇప్పుడవి అపహాస్యంగా మారాయి. అసాధారణమైన వ్యక్తిగా పేరొందిన ఆయన అత్యంత సాధారణంగా ఆలోచించారు. సత్యం నిధులతో మేటాస్‌లో వాటా కొనుగోలు చేయాలన్న 'వినూత్నమైన' ఆలోచన ఆచరణలో తిరగబడింది. తుది ఫలితం ఊహించకుండా వేసిన అడుగులు పూర్తిగా తడబడ్డాయి.
కంప్యూటర్ అంటే అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన కాలంలో... దాని బంగారు భవిష్యత్తును గ్రహించి, పెట్టుబడులు పెట్టిన వ్యక్తి రామలింగరాజు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న గరగపర్రులో జన్మించారు. తండ్రి, తాత పెద్ద రైతులు. రాజు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లో కొన్నాళ్లు వ్యాపారం చేశారు. స్పిన్నింగ్ మిల్ నడిపారు. ఇతర వ్యాపారాలూ చేశారు.
1980లలో కంప్యూటర్ సేవా రంగంలో మన రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఒక్క కంపెనీ కూడా లేదు. ఈ సమయంలో 1987లో సత్యం ఒక చిన్న కంపెనీగా మొదలైంది. 'ఇంతింతై వటుడింతై' అన్నట్లు విదేశాలకూ విస్తరించింది. వేల కోట్ల ఆదాయం ఉన్న కంపెనీగా ఎదిగింది. ఈ మొత్తం ప్రస్థానంలో రామలింగరాజుదే కీలకపాత్ర. కంపెనీతో పాటు రాజు కూడా అంతర్జాతీయ ఐటీ రంగంలోనే ఒక విలక్షణమైన వ్యక్తిగా పేరు పొందారు.
2004లో ఉద్యోగాల అవుట్ సోర్సింగ్‌పై అమెరికాలో పెద్ద దుమారం చెలరేగింది. "అమెరికన్లు బిన్ లాడెన్‌కే కాదు. ఉద్యోగాలను భారత్‌కు పట్టుకుపోతున్న రామలింగరాజుకు కూడా భయపడుతున్నారు'' అని అమెరికా మీడియా వ్యాఖ్యానించిందంటే ఆయన స్థాయి అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో రాజులో అంతర్గతంగా ఉన్న పుత్ర వాత్యల్సం బయటకు వచ్చింది.
"నా కుమారుడే వ్యాపార వారసుడు కావాలనుకుంటున్నా. సత్యంను మరింత ముందుకు నడిపించాలనుకుంటున్నా'' అని ఒక తెలుగు టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఈ వ్యాఖ్యలు ఇబ్బందులు సృష్టిస్తాయని భావించిన కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగం వారు ఈ వ్యాఖ్యలను తొలగించారు. అదే నేపథ్యంలోనే రాజు తనయులు మేటాస్‌ను (సత్యం ఇంగ్లిష్ స్పెలింగ్‌ను తిరగేస్తే మేటాస్ అవుతుంది) స్థాపించారు.
అది అతి కొద్ది కాలంలోనే దేశంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీగా ఎదిగింది. ఇప్పటిదాకా జరిగిన, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే... ఒక నిష్పాక్షికమైన నిపుణుడిగా రాజు ప్రస్థానం ఎప్పుడో ఆగిపోయి ఉండొచ్చని అనిపిస్తుంది. కానీ, ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికి తెలిసిన విషయాలు కొన్నే! ఇంకా ఎన్నో బయటపడాల్సి ఉంది. ఏది ఏమైనా రామలింగరాజు ప్రస్థానం.. ఎదుగుదల.. పతనం.. ఈ మూడు ఐటీ కార్పొరేట్ చరిత్రలో నిలిచిపోయే అంశాలే! విషాదమేమిటంటే... ఒకప్పుడు రాజును చూస్తే అమెరికన్లు మాత్రమే భయపడేవారు. ఇప్పుడు మన వాళ్లు కూడా భయపడుతున్నారు!












Click it and Unblock the Notifications