హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజుకు జ్వరం: పోలీసులు నిదానం

By Staff
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజును సోమవారం నాడు ఇంకా క్షణ్ణంగా విచారించడానికి సిఐడి పోలీసులు సిద్ధమవుతున్నారు. రామలింగరాజు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. సిఐడి అధికారుల ప్రశ్నలకు రాజు "అవును", "కాదు" అని మాత్రమే జవాబు చెబుతున్నారు. ఆయన ఉద్వేగంగా మారిపోయి వివరాలు చెబుతారని ఆశించిన పోలీసులకు నిరాశే ఎదురైంది.

సత్యం కుంభకోణంలో వాస్తవాలను దాచిపెట్టేందుకు రామలింగరాజు ప్రయత్నిస్తున్నట్లు సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.7 వేల కోట్లు ఎటుపోయిందో ఆయన కచ్చితమైన సమాధానం ఇవ్వడంలేదని తెలిసింది. సీఐడీ ముందుగా నిర్ధారించుకుని అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానం చెబుతున్నారు తప్ప.. తనంత తానుగా ఎలాంటి సమాచారం వెల్లడించడంలేదు. చాలా ముక్తసరిగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. తొలిరోజు సీఐడీ విచారణ ప్రధానంగా రాజీనామా లేఖ చుట్టూనే తిరిగింది.

న్యాయస్థానం అనుమతి ప్రకారం ఆదివారం చంచల్‌గూడ జైలులో రామలింగరాజు, రామరాజు, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు.. సరాసరి మసాబ్‌ట్యాంకు వద్ద ఉన్న సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. భోజనం తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి విచారణ మొదలుపెట్టారు. తొలిరోజు కావడంతో పెద్దగా వివరాల్లోకి వెళ్ళలేదు. రాజు రాసిన రాజీనామా లేఖలోనే అనేక అంశాలు ఉండడంతో వాటికి సంబంధించి ప్రశ్నలు అడిగారు. లెక్కల్లో చూసిన ఆదాయానికి, వాస్తవానికి పొంతన లేకపోవడం; మైటాస్‌ను టేకోవర్‌ చేసుకొని లోటును సర్దుబాటు చేసుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడం వల్లనే తాను రాజీనామా చేశానని రామలింగరాజు పోలీసులకు చెప్పారు. దీనికి సంబంధించే పోలీసులు మరికొన్ని ప్రశ్నలు అడిగారు. సాధారణంగా ఇలాంటి విచారణలో నిందితుల నుంచి వివరణాత్మక సమాధానం వస్తుందని, రాజు మాత్రం 'అవును', 'కాదు' అని మాత్రమే సమాధానం చెబుతున్నారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. తనంతతాను ఎలాంటి సమాచారం ఇవ్వకూడదన్నది ఆయన ఉద్దేశమై ఉంటుందని ఆ అధికారి విశ్లేషించారు. ఉదాహరణకు ఫలానా బ్యాంకులో మీకు ఇన్ని ఖాతాలు ఉన్నాయి కదా అని అడిగితే 'అవును' అని మాత్రమే చెబుతున్నారని, ఇతర బ్యాంకుల్లో ఉన్న ఖాతాల గురించి మాట్లాడడంలేదని సమాచారం.

అన్ని ప్రశ్నలకూ ఆయన ఇదే తరహాలో సమాధానం చెప్పారని, దీనివల్ల పోలీసులు కూడా ఆచూతూచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన విచారణ మధ్యలో స్వల్ప విరామం మినహాయిస్తే సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగింది. రాజు ప్రతిస్పందన చూసిన పోలీసులు సోమవారం నుంచి అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేస్తున్నారు. తొలిరోజు విచారణ పూర్తయిన వెంటనే సమావేశమైన ఉన్నతాధికారులు దీనికి సంబంధించి కసరత్తు చేశారు. గత వారం రోజుల్లో తాము చేసిన దర్యాప్తుల్లో వెల్లడయిన విషయాల ఆధారంగా ప్రశ్నలను సిద్ధం చేస్తున్నారు. మొదటిరోజు శ్రీనివాస్‌, రామరాజులను ప్రశ్నించలేదు. సోమవారం నుంచి వీరిని కూడా విచారించనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X