సరస్వతీ అంత్య పుష్కరాలు.. విశేషాలు ఇవే!
జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతి నది అంత్య పుష్కరాలు ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ తీర్థక్షేత్రం కాళేశ్వరంలో ఘనంగా జరగనున్నాయి. తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్ల, కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీలు ఈ మహోత్సవాలను ప్రారంభించనున్నారు.
త్రివేణి సంగమంలో ఆధ్యాత్మిక వైభవం
గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర స్థలం ఇప్పటికే ఆధ్యాత్మిక వైభవంతో నిండిపోయింది. లక్షలాది భక్తులు రానున్న క్రమంలో దేవస్థానం మరియు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పుష్కర స్నానాలు, దేవాలయ దర్శనాలతో పాటు తెప్పోత్సవాలు, మహా హారతులు, ప్రత్యేక పూజలు, హోమాలు భక్తులను ఆకర్షించనున్నాయి. ఈ కార్యక్రమాలు కాళేశ్వరాన్ని మరింత దివ్యంగా మార్చాయి.

కాళేశ్వరంలో గోదావరిలో అంతర్వాహినిగా కలిసే స్థానంలో పవిత్ర స్నానాలు
వేదాలు మరియు పురాణాల్లో సరస్వతి నదిని అత్యంత పవిత్రమైనదిగా వర్ణించారు. హిమాలయాల నుంచి ఉద్భవించి భూగర్భంలో ప్రయాణించే ఈ నది జ్ఞానప్రదాయినిగా చెప్తారు. కాళేశ్వరంలో గోదావరిలో అంతర్వాహినిగా కలిసే స్థానం కారణంగా ఇక్కడి పుష్కరాలు విశేష ఫలితాలు ఇస్తాయని భక్తుల విశ్వాసం.
త్రివేణి సంగమంలో తెప్పోత్సవం స్పెషల్
పుష్కర స్నానం చేస్తే పాపాలు తొలగి, విద్యాభివృద్ధి, జ్ఞానం, మానసిక శాంతి లభిస్తాయని పండితులు చెబుతున్నారు. పుష్కరాల్లో అత్యంత ఆకర్షణీయమైన కార్యక్రమం త్రివేణి సంగమంలో జరిగే తెప్పోత్సవం. విద్యుత్ దీపాలు, అందమైన అలంకరణలతో తయారు చేసిన తెప్పపై దేవతా విగ్రహాలను నదిలో విహరింపజేస్తారు. వేలాది భక్తులు భజనలు, మంగళవాద్యాల మధ్య ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తారు. ఇది భక్తుల మనసులను ఆనందంతో నింపుతుంది.
మహా హారతి, సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు
ప్రతి సాయంత్రం త్రివేణి సంగమ తీరంలో గంగా హారతి తరహాలో వేద మంత్రోచ్ఛారణలు, దీపాలు, గంటల నాదాల మధ్య మహా హారతి నిర్వహిస్తారు. కాశీ నుంచి వేద పండితులు ప్రత్యేకంగా వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. సంగమ తీరంలో సరస్వతి అమ్మవారి విగ్రహానికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు జరుగుతాయి. సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
అంత్య పుష్కరాలకు రూ. 30 కోట్ల నిధులు
ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. నేడు కంచి పీఠాధిపతి విజయేంద్రస్వామితో కలిసి భద్రకాళీ అమ్మావారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఈ అంత్య పుష్కరాలకు రూ. 30 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. కాళేశ్వరంలో జరిగే ఈ సరస్వతి పుష్కరాల్లో ప్రతి రోజు సాయంత్రం గోదావరి హారతి ఇస్తారని చెప్పారు.
ప్రతీరోజూ ఒక స్వామీజీతో పుష్కర స్నానాలు
ప్రతీరోజూ ఒక స్వామీజీతో పుష్కర స్నానం చేయించి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కంకణం కట్టుకుందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాల నాటికి అన్ని పుష్కర ఘాట్ ల వద్ద ఏర్పాట్లు చేస్తామని, చాలా ఘనంగా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు.













Click it and Unblock the Notifications