'సత్యం'పై వైఎస్ సత్యాల లేఖ

ఖాతాల్లో అవకతవకలు చేసి ఏడేళ్లపాటు మదుపుదారులను, బ్యాంకర్లను మభ్యపెట్టిన సత్యం సంస్థపై సీబీఐ విచారణ జరిపించినా తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ చెప్పారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సత్యం వ్యవహారంపై రాసిన లేఖలో ముఖ్యమంత్రి పలు విషయాలను ప్రస్తావించారు. మార్కెట్‌లో పైచేయి సాధించడానికి ఎకౌంట్లను ఎక్కువ చేసి చూపడం ద్వారా సత్యం అందరినీ మోసగించిందని ఇప్పటివరకూ జరిగిన విచారణలో తేలిందని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.
ఈ సంస్థపై వివిధ ప్రభుత్వ విభాగాలు విచారణకు పూనుకున్నాయనీ, అయితే ఈ సంస్థల మధ్య సమన్వయం అవసరమని రాజశేఖర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సత్యం అనుబంధ సంస్థలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని లేఖలో రాశారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయనీ, ప్రభుత్వంపై బురదజల్లడానికి ఉపయోగించుకుంటున్నాయని ప్రధానికి తెలిపారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలకు సత్యంపై విచారణలో అన్నివిధాలా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ లేఖ కాపీలను ముఖ్యమంత్రి విదేశాంగమంత్రి, ప్రస్తుతం ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రణబ్‌ముఖర్జీకి, కంపెనీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రేమ్‌చంద్ గుప్తాకు కూడా పంపించారు. సీఐడీ అధికారులు సెబీ, రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్, తీవ్ర ఆర్థికనేరాల విచారణ విభాగం అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉందని చెప్పారు. విచారణ కొంచెం క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ, నేరస్థులకు తప్పకుండా శిక్ష పడుతుందనే ధీమా వైఎస్ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications