రైలు ప్రమాదంలో 18 మంది మరణం
కటక్: హౌరా నుంచి చెన్నై వెళుతున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(2841 అప్) శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఒరిస్సాలోని జాజ్‌పూర్ రోడ్డు రైల్వేస్టేషన్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతిచెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతులు 15 మందేనని, 50-60 మంది దాకా గాయపడ్డారని రైల్వేమంత్రి లాలు ప్రసాద్ ఢిల్లీలో ప్రకటించారు. ప్రమాదంలో రైలు డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందువల్ల మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని సమాచారం. గాయపడిన వారిని కటక్ ఎస్సీబీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఎస్‌ఎల్‌ఆర్-1, జనరల్ బోగీలు-2, స్లీపర్ బోగీలు-11, ప్యాంట్రీకార్-1 కలిపి మొత్తం 15 బోగీలు పట్టాలు తప్పినట్లు ఖుర్దారోడ్ సహాయ కేంద్రానికి సమాచారం అందింది. ప్రమాద ప్రాంతంలో ఎగువ, దిగువ మార్గాల్లో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. రైలు జాజ్‌పూర్ స్టేషన్ దాటిన తరువాత ఔటర్‌లో పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు 60 నుంచి 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. రైలు వేగంగా వెళుతున్నందువల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ఓ ప్రత్యక్షసాక్షి తెలిపారు. జాజ్‌పూర్‌లో ఈ రైలు ఆగదు. దుర్ఘటనపై లాలు విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications