జయప్రదకు ములాయం చెయ్యి?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసే 24 మంది లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ బుధవారం విడుదల చేసింది. ఇందులో రాయబరేలీ నుంచి సోనియాగాంధీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ పేర్లు ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ నుంచి సినీనటి జయప్రద ప్రాతినిధ్యం వహిస్తున్న రాంపూర్ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది.
ఈ స్థానం నుంచి 2004 ఎన్నికల్లో జయప్రద చేతిలో పరాజయం పాలైన రాంపూర్ మహారాణి నూర్‌బానో పేరును కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో జయప్రద రాజకీయ భవిష్యత్తు డోలాయమాన స్థితిలో పడింది. పొత్తులో భాగంగా ఈ సారి రాంపూర్ సీటు తమకు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో 25 స్థానాల కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసే ప్రసక్తి లేదని కాంగ్రెస్ ఇప్పటికే తెగేసి చెప్పింది. ఈ నేపధ్యంలో జయప్రద ఆంధ్రప్రదేశ్ నుంచి సమాజ్ వాది పార్టీ అభ్యర్ధిగా పోటే చేసే అవకాశముంది.
దీంతో కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకోవడమా? లేక జయప్రదతో పాటు పలువురు సిట్టింగ్ ఎంపీలకు మొండిచేయి చూపడమా? సమాజ్‌వాదీ పార్టీకి తేల్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ యూపీలో జయప్రద స్థానాన్ని త్యాగం చేయడానికి ఎస్‌పీ అంగీకరిస్తే ఆమెకు ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి సీటు కేటాయించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ విడుదల చేసిన మొత్తం 24 మంది అభ్యర్థుల్లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు తొమ్మిది మంది సిట్టింగ్ అభ్యర్థులున్నారు. యూపీసీసీ మాజీ అధ్యక్షుడు జితేంద్ర ప్రసాద్ కుమారుడు జితిన్ ప్రసాద్, సల్మాన్ ఖుర్షీద్, రత్నా సింగ్, ఆర్.పి.ఎన్. సింగ్, నిర్మల్ ఖత్రి, పి.ఎల్. పునియా, అను టాండన్, భోలా పాండే, సుధా రాయ్, హైరేంద్ర మాలిక్, సంజయ్ సింగ్, జగదాంబికా పాల్, ప్రవీణ్ ఆర్యన్, రాజ్‌బబ్బర్, బేనీ ప్రసాద్ వర్మ కాంగ్రెస్ తొలి జాబితాలో ఉన్నారు.












Click it and Unblock the Notifications