చిరు సభ మెగా హిట్

ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత గోదావరి జిల్లాల్లో ఇదే ఆ పార్టీ తొలి బహిరంగ సభ. దీనికితోడు చిరంజీవి వస్తుండటంతో నగరం జనసంద్రమైంది. అడుగడుగునా జనం చిరంజీవికి నీరాజనాలు పలికారు.రాజమండ్రితో తనకున్న సినీబంధంతో సరళంగా మొదలైన ఆయన ప్రసంగం ప్రజారాజ్యం ఆవిర్భావానికి కారణాలు, లక్ష్యాలను వివరిస్తూ గంభీరంగా సాగింది.
వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం బడుగు బలహీన వర్గాలకు అత్యధిక సీట్లు కేటాయిస్తుందని చిరంజీవి ప్రకటించారు. రాష్ట్రంలో 30 ఏళ్లనుంచి ఈ వర్గాలను తెదేపా, కాంగ్రెస్‌లు మోసం చేస్తున్నాయని చెప్పారు. ఎనిమిది జిల్లాల్లో అసలు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదని వివరించారు. అసలు వైఎస్ కడప జిల్లాలో బలహీనవర్గాలకు ఎన్ని సీట్లిచ్చారు? అని నిలదీశారు. రెండు పార్టీలు ఇంతకాలం వెనుకబడిన వర్గాలను పల్లకీ మోసే బోయీలుగా వాడుకుంటున్నాయని, ఇకనైనా ఏకమై, ప్రభువులుగా మారుదామని ఆవేశంగా పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications