హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ అల్లుడిపై డిజిపి ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరీంనగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి అల్లుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ మత ప్రచారం పేరిట చేసిన పర్యటన, డబ్బు పంపిణీవ్యవహారాలపై డీజీపీ ఏకే మహంతి మండిపడ్డారు. కరీంనగర్‌ జిల్లా రేకుర్తిలో సోమవారం క్రైస్తవ మతప్రచారంలో భాగంగా బ్రదర్‌ అనిల్‌కుమార్‌ సభ నిర్వహించారు. మామ గెలుపు కోసం ప్రార్థనలు చేయించారు.

తర్వాత రత్నా లాడ్జిలో రెండు రోజులుగా ఉంటున్న పాస్టర్లు శామ్యూల్‌, జయరాజ్‌, కుమార్‌లను కలిసి వెళ్లారు. ఆయన వెళ్లాక అక్కడ సోదా చేయగా, రూ. 10 లక్షల నగదు దొరికిన వైనంపై డీజీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో నగదు దొరికినా స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోవడం, స్వాధీనం చేసుకున్న సొమ్మును క్రైస్తవ ప్రచారకులకు తిరిగి ఇచ్చేయడంపై కరీంనగర్‌ జిల్లా ఎస్పీ విక్రంసింగ్‌ మాన్‌ను డీజీపీ పలుమార్లు ప్రశ్నించినట్లు సమాచారం. జిల్లా ఎస్పీలు, రేంజ్‌ డీఐజీలు, ఐజీలతో డీజీపీ మహంతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సుమారు మూడుగంటలకు పైగా జరిపిన ఈ సమావేశంలో గత వారం రోజులుగా రాష్ట్రంలో పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎలా నిర్వహించారనే వివరాలను పరిశీలిస్తూ కరీంనగర్‌ పోలీసుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్‌లో వచ్చిన బ్రదర్‌ అనిల్‌కుమార్‌ నోట్లకట్టలున్న బ్రీఫ్‌కేసులను వెంటబెట్టుకుని తిరుగుతూ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓట్లు వేయించేందుకు డబ్బు పంచుతున్నారని పత్రికల్లో వస్తున్న కథనాలను డీజీపీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

గత వారంలో ఖమ్మం జిల్లాకు వెళ్లిన అనిల్‌కుమార్‌ ప్రార్థనామందిరంలో రాజకీయ ప్రచారం చేయడం, సమావేశానికి వచ్చినవారికి డబ్బు పంపిణీ చేయడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రదర్‌ అనిల్‌కుమార్‌ విషయంలో కరీంనగర్‌, ఖమ్మం పోలీసులు సరిగా స్పందించలేదని భావించిన మహంతి ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని సంబంధిత డీఐజీలను ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.

హెలికాప్టర్లలో వెళ్లేవారినీ తనిఖీచేయండి ఎన్నికల వేళ హెలికాప్టర్లలో రాజకీయ నాయకుల పర్యటనలు ఎక్కువ కావడం, హెలికాప్టర్లలో బ్రదర్‌ అనిల్‌ లాంటి వారు డబ్బు తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇకపై హెలికాప్టర్లలో ప్రయాణించేవారిని కూడా తనిఖీ చేయాలని డీజీపీ మహంతి ఆదేశాలు జారీ చేశారు. హెలికాప్టర్‌లో ఎక్కేముందు, ప్రయాణం తర్వాత తమ వాహనాల్లో బయల్దేరే ముందు పోలీసులు సోదా చేయాలని, నాయకుల వెంట ఉన్న బ్యాగేజ్‌పై దృష్టి సారించాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. సోదాల్లో ఏ ఒక్కరినీ మినహాయించాల్సిన అవసరం లేదని, నిష్పక్షపాతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీపై పలువురు నాయకులు చేసిన ఆరోపణలపై విచారణ నిర్వహించాలని ఏలూరు రేంజ్‌ డీఐజీని ఆదేశించినట్లు తెలుస్తోంది. రిగ్గింగ్‌, పోలింగ్‌బూత్‌ల్లో విధ్వంసం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం తదితర ఎన్నికల నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించడానికి వెనుకాడవద్దని మహంతి ఆదేశించారని తెలుస్తోంది.

ఎన్నికల్లో ఇలాంటి నేరాలకు పాల్పడే 1600 మందిని గుర్తించామని, వీరందరినీ పోలింగ్‌కు ఒకటి, రెండు రోజుల ముందే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న జిల్లా ఎస్పీలు మందుపాతరల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నక్సల్స్‌ వెనక్కి తగ్గారని భావించి నిర్లక్ష్యంగా ఉండరాదని, గెరిల్లా యుద్ధంలో వెనక్కి తగ్గడం యుద్ధతంత్రంలో భాగమేనన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X