నాది పేదల పక్షం: అనకాపల్లిలో రాహుల్

బ్రిటన్ మంత్రిని తన నియోజకవర్గంలోని గ్రామాలకు తీసికెళ్లి నిరుపేదల శక్తిసామర్థ్యాలను చూపించానని, దానికి ప్రతిపక్షాలు తనపై విమర్శలు చేశారని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని 90 శాతం ప్రజలే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని, దాన్ని చూపించడానికి తాను సిగ్గుపడబోనని ఆయన అన్నారు. తనకు నిరుపేదల శక్తిసామర్థ్యాల మీదనే విశ్వాసం ఉందని, వారే దేశాన్ని ముందుకు నడిపిస్తారని ఆయన అన్నారు. వారు హైదరాబాదును మాత్రమే నిర్మించాలనుకుంటారని, తాము కూడా హైదరాబాదును కోరుకుంటామని, అయితే ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలను కూడా చూస్తామని, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అదే చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకం, రైతుల రుణ మాఫీ వంటి కార్యక్రమాలను ఆయన ఉదహరించారు.
మతాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా దేశ పౌరులందరూ సమాన హక్కులు పొందాలని, దేశం అభివృద్ధిలో ముందుకు సాగాలని తమ పార్టీ కోరుకుంటోందని రాహుల్ గాంధీ చెప్పారు. మన దేశాన్ని ముక్కలు చేయాలని శత్రులు కుట్రలు పన్నుతున్నారని ఆయన చెబుతూ కొన్ని ఉదంతాలను చెప్పారు. గ్రామాలకు వెళ్లి చూసినప్పుడు ప్రజల శక్తియుక్తులు తెలిసి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పేదలు, సామాన్య ప్రజలే ఈ దేశం సత్తా అని, కష్టాలను ధైర్యంతో ఎదుర్కోవడం, నీతిగా బతకడం ఈ దేశ ప్రజల సంప్రదాయమని, అదే ఈ దేశ ఔన్నత్యమని ఆయన అన్నారు.
ఈ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ తొమ్మిదేళ్ల పాలనపై ముఖ్యమంత్రి విమర్శల వర్షం కురిపించారు. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.












Click it and Unblock the Notifications